మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి జగదీష్ జోస్యం

మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధువారం మునుగోడు టీఆర్ఎస్ నేతలతో మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారని..ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికకు తామంతా సిద్ధంగా ఉన్నామని వారంతా చెప్పినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యేగా మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి చేసిందేమి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సంచలన ప్రకటనలు చేయడం తప్ప ఆయన చేసింది శూన్యం అని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం మాత్రమే ఉప ఎన్నిక తీసుకొచ్చారని.. ఆయన్ను ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తులు లేవ‌ని స్పష్టం చేసారు. అంద‌రూ ఐక్యంగా ఉన్నార‌ని .. కేసీఆర్ నాయ‌క‌త్వానికి ప్రజల్లో ఎనలేని ఆద‌ర‌ణ ఉంద‌న్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఆ పార్టీ కి , పదవికి రాజీనామా చేయడం తో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలతో పాటు సిపిఐ కూడా భావిస్తుంది. దానికి తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఓటర్లు ఎవరికీ పట్టం కడతారో చూడాలి.