కేంద్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస ధర్నా

వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిని తప్పుపడుతూ తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కు దిగింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతునిస్తున్నారు. రైతుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న వైఖరి పట్ల కేంద్రం మెడలు వంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సూర్యపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల జేబులు నింపుతుంటే ప్రధాని మోదీ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధర్నా కు దిగారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రైతుల పట్ల కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతలకు అండగా ఉండాల్సిన సర్కార్.. వారి నడ్డివిరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. సిరిసిల్ల లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మేడ్చల్ డిపో ఎదుట తెరాస ధర్నాలో కార్మిక మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్​లో మంత్రి పువ్వాడ , ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.