మేడ్చల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటి వరకు టిఆర్ఎస్ కు తిరుగులేదని అంత అనుకున్నారు కానీ ఇప్పుడు అంత రివర్స్ అయ్యింది. రోజు రోజుకు రాష్ట్రంలో బిజెపి బలం పెరిగిపోతుంది. వరుస పెట్టి టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు , కీలక లీడర్స్ , సినీ నటి నటులు , మాజీ నేతలంతా కూడా బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు కారు దిగి కాషాయం జెండా పట్టుకోగా..అతి త్వరలో మరికొంతమంది కీలక నేతలు బిజెపి లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మేడ్చల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది.

కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు ఘట్‌కేసర్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు, మాజీ ప్రజా ప్రతినిధులు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు. హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ శనివారం అవుషాపూర్‌లోని ఎంపీపీ నివాసంలో చర్చలు జరిపారు.

వారం రోజుల్లో మండలంలో సమావేశం నిర్వహించి అవుషాపూర్‌ సర్పంచ్‌ కావేరి మశ్చేందర్‌రెడ్డితో పాటు పలువురితో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ఎంపీపీ ప్రకటించారు. స్థానిక సంస్థల అభివృద్ధికి నిధుల విడుదల చేయాలని అధికార పార్టీ ఎంపీపీగా ఉండి గత కొంత కాలంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై పలుమార్లు ఆసంతృప్తిని వ్యక్తం చేసిన, నిధులు కోసం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కలెక్టర్లను కోరినా నిధులు ఇవ్వకపోవడం వల్లనే పార్టీని వీడుతున్నట్లు ఎంపీపీ ప్రకటించారు.