సిఎం కెసిఆర్‌పై పొగడ్తల వర్షం

మాజీ ప్రధాని పీవీకి, సిఎం కెసిఆర్‌కు ఎన్నో పోలికలున్నాయి

హైదరాబాద్‌: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పీవీ నరసింహారావుకు, తెలంగాణ సిఎం కెసిఆర్‌ కు అనేక అంశాల్లో సారూప్యత ఉందని తెలిపారు. తన తండ్రి పీవీ రైతు అని, సిఎం కెసిఆర్ కు కూడా వ్యవసాయం అంటే ఎంతో మక్కువ అని వివరించారు. పీవీ సంస్కరణాభిలాషి అని, కేసీఆర్ కూడా సంస్కరణలు కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు.

తన తండ్రికి 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్నా, మాతృభాష, యాస ఎప్పుడూ విడిచిపెట్టలేదని వాణీదేవి అన్నారు. ఇంటికి వస్తే ఆయన తెలంగాణ యాసలోనే మాట్లాడేవారని తెలిపారు. సిఎం కెసిఆర్ కూడా భాష కోసం, యాస కోసం ఎంతో తాపత్రయం చూపుతారని, భాష, యాస మనుగడను ఆయన పరిరక్షించారని కొనియాడారు. తెలంగాణ భాషనే అసలైన తెలుగు భాషగా చెప్పే స్థాయికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. పీవీ, కెసిఆర్ ఇద్దరూ సాహిత్యం పట్ల అభిలాష ఉన్నవారేనని వాణీదేవి వివరించారు. నాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వ్యక్తి పీవీ అయితే, తెలంగాణను సాధించి, రక్షించిన మహానుభావుడు కెసిఆర్ అని ఆమె కీర్తించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/