పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ టిఆర్ఎస్ నేతల డిమాండ్

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని టిఆర్ఎస్ నేతలు వాపోయారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చి మూడు మీటర్లు ఎత్తు పెంచుకున్నారు.. దీని వల్లే భద్రాచలానికి వరద వచ్చిందన్నారు. ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వరదల నివారణకు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఉన్న ముప్పును నివారించాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి తమ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని గుర్తు చేశారు. పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు తాము నిరసన తెలిపామన్నారు. ఏపీలో విలీనం అయిన 7 మండలాలను తెలంగాణలో కలపాలి. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టి ఆమోదించాలని కోరారు.
భద్రాచలం ఇరు వైపులా కరకట్టలను పటిష్టం చేసేందుకు, ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన చర్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంత్రి పువ్వాడ అన్నారు. రూ. 1000 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన కేసీఆర్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్యే నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాత మధు లు మంత్రి పువ్వాడ తో కలిసి పాల్గొన్నారు.