ముత్తిరెడ్డి సవాల్.. గుంట భూమి చూపిస్తే రాజీనామా!

ముత్తిరెడ్డి సవాల్.. గుంట భూమి చూపిస్తే రాజీనామా!

టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టాపిక్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. భూ ఆక్రమణల ఆరోపణలతో ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించడం, పార్టీ నుండి తొలగించడంతో రాజకీయ నేతలు పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలు కేసీఆర్ పతనం మొదలైందని కామెంట్ చేస్తుంటే, మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణల గురించి తెరాస ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, తాను కబ్జా చేశానని అంటున్న 60 ఎకరాల్లో గుంట భూమిని చూపించినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముత్తిరెడ్డి సవాల్ విసిరారు. తాను భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే జనగామ చౌరస్తాలో అంబేద్కర్ పాదాల వద్ద ముక్కు నేలకు రాసి రాజీనామా పత్రం అంబేద్కర్ పాదాల వద్ద ఉంచి, కేసీఆర్‌కు అందజేస్తానని ఆయన అన్నారు.

ఈటెల రాజేందర్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారగా, తాజాగా ముత్తిరెడ్డి సవాల్ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. మరి ముత్తిరెడ్డి సవాల్‌కు బండి సంజయ్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.