నేడే తెరాస మహాధర్నా ..

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరాస పార్టీ పోరుబాట పట్టింది. నిన్నటి వరకు కేంద్రం ఫై విమర్శలు చేసిన రాష్ట్ర సర్కార్..గురువారం ఏకంగా మహా ధర్నా కు కూర్చుబోతుంది. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ మహా ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు మెమొరాండం సమర్పిస్తారు.

మహా ధర్నాకు ఒకరోజు ముందు ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని కోరారు. 2020-21 ఎండాకాలం సీజన్లో సేకరించని 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలన్నారు. 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలన్న నిబంధన మరింతగా పెంచి, పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా వానాకాలం పంటలో 90శాతం వరిని సేకరించాలన్నారు. వచ్చే యాసంగిలో తెలంగాణ నుంచి కేంద్రం ఎంత వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్ధారించాలని లేఖలో కోరారు.