బీజేపీ ఓ బద్మాష్ పార్టీ .. బీజేపీ ఒక పార్టీయేనా..? అంటూ తెరాస నేతలు ఫైర్

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరాస పార్టీ పోరుబాట పట్టింది. గురువారం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా మొదలుపెట్టారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు .

ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం వైఖరితో రైతుల కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, దానికి స్పందన వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని, తెలంగాణలో బీజేపీ ఒక పార్టీయేనా? అని ప్రశ్నించారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే మళ్ళీ మళ్ళీ బీజేపీ నేతలను ఉరికిచ్చి కొడతారని ఆయన అన్నారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బద్మాష్ పార్టీ అని… తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతులు పండించిన పంటను ఎఫ్ సీఐ కొనుగోలు చేయాలి.

తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ల లో తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ స్పందించి తెలంగాణ ధాన్యం కొనుగోలు పై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.