పోలింగ్ బూత్ వద్ద తెరాస నేత కౌశిక్ రెడ్డికి చుక్కలు చూపించిన గ్రామస్థులు

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ వాడి వేడిగా నడుస్తుంది. వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. ఓటర్లంతా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతే కాదు కౌశిక్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటి వరకు తరిమారు. పోలింగ్ సెంటర్‎కు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం ఉద్రికత్తకు దారి తీయడం తో కౌశిక్ అక్కడి నుండి వెళ్లిపోయారు.

మరి కొన్ని చోట్ల తెరాస , బీజేపీ కార్య కర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వీణవంక లో డబ్బులు పంచుతున్న తెరాస నేతలను బిజెపి నేతలు అడ్డుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కాలేజీ సెంటర్ లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండగా అడ్డుకున్నారు బీజేపీ నాయకులు. టీఆర్ఎస్ ఇంచార్జులు అక్కడే ఉండి డబ్బులు పంపిణీ చేయడంపై మండిపడ్డారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక ఇల్లందుకుంటలోని పోలింగ్ కేంద్రం 224 బూత్ లో ఈవీఎం మెరాయింపుతో పోలింగ్ ఆలస్యం అవుతుంది.