సాగర్‌లో కారు జోరు.. వికసించని కమలం!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. సాగర్‌లో అత్యంత ఉత్కంఠంగా జరిగిన ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది. సాగర్ బైపోల్‌లో తమ పార్టీయే గెలుస్తుందని అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహీరీగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా తెరాస పార్టీని ఈ బైపోల్ ఎన్నికలో చిత్తుగా ఓడించాలని కమలం దండు అన్నిరకాల ప్రయత్నాలు చేయడంతో ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే ఇవాళ ఉదయం 8 గంటలకు సాగర్ ఉపఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. అయితే తొలి రౌండ్ నుండి కూడా తెరాస అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు నాలుగు రౌండ్‌ల కౌంటింగ్ ముగిసింది. నాలుగో రౌండ్‌లో తెరాస పార్టీ అభ్యర్థికి 4186 ఓట్లు నమోదు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 3202 ఓట్లు నమోదయ్యయి.

సాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అభ్యర్థికి చాలా తక్కువ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నాగార్జున సాగర్‌లో జానారెడ్డి ప్రస్తుతం 3457 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. మరి ఈ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠకు మరికాసేపట్లో తెరపడనుంది.