మరో 20 ఏళ్ల పాటు అధికారంలో టిఆర్ఎస్సే – మంత్రి తలసాని

మరో 20 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు మంత్రి తలసాని. ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా టిఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బిజెపి గాలి బుడగ లాంటిదని.. కాంగ్రెస్ అంతరించిపోతుందని అన్నారు. గుజరాత్ ను మోడీ అభివృద్ధి చేస్తే ఎన్నికలలో గల్లి గల్లి ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ ఎవరి తాటాకు చప్పులకు బెదరదు అన్నారు. మంత్రి మల్లారెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు ఆయన ఫోన్ ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది.. రేపు మాకు కూడా సమయం వస్తుంది అని హెచ్చరించారు. మా 60 లక్షల మంది కార్యకర్తలు ఢిల్లీని అటాక్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని హెచ్చరించారు. ఇక పార్టీలో కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.