టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌ అయ్యింది..

టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్‌ గా మార్చేశారు పార్టీ అధినేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పర్వదినాన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై టిఆర్ఎస్ ‘బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి )’ గా మారింది. రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక.. మధ్యాహ్నం 1: 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. ఈ భేటీకి తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు.

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. కేసీఆర్‌ చార్టర్డ్‌ విమానంలో ఈ సాయంత్రమే.. వీరు ఢిల్లీ వెళ్తారు.. గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

కేసీఆర్‌ ఆహ్వానం మేరకు దేశవ్యాప్తంగా 40 మంది ప్రముఖులు హైదరాబాద్‌ వచ్చారు. వారిలో రైతు సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటికే అనేకమంది రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. వారంతా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలందరి సహకారంతో కిసాన్‌సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, ఉచిత విద్యు త్తు తదితర కార్యక్రమాలను దేశమంతటా ఆ సంఘం ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిసింది.