క్రైస్తవ సమాజానికి టిఆర్ఎస్ అండగా ఉంటుంది
పాస్టర్లు, బిషప్స్తో మంత్రి కెటిఆర్ సమావేశం

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో పాస్టర్లు, బిషప్స్తో రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. క్రైస్తవ మిషనరీలు కొన్ని దశాబ్దాలుగా విద్య, వైద్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు మొదట స్పందించేది క్రైస్తవ సమాజమేనని కొనియాడారు. కోకాపేటలో క్రైస్తవ భవనం పనులను 15 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. సచివాలయంలో మంచి చర్చిని నిర్మించాలని.. సిఎం కెసిఆర్ సంకల్పంతో ఉన్నారని కెటిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్ హిందూ ధర్మాన్ని బలంగా నమ్ముతారు.
అదే సమయంలో ఇతరుల నమ్మకాలను కూడా గౌరవిస్తారు. రాష్ర్టంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. స్వరాష్ర్టంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ ముందుకు వెళ్తున్నారు. రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం 940 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ గురుకులాల్లో 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. క్రైస్తవ సమాజానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు కెటిఆర్, కొప్పుల ఈశ్వర్, రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పాల్గొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/