టిఆర్‌ఎస్‌లో జోరుగా నామినేషన్ల సందడి

TRS
TRS

బుధవారం మంచి ముహుర్తాలు ఉండటంతో సిఎం కేసిఆర్‌ సహా…
పలువురు మంత్రులు, కీలక నేతలు నామినేషన్లు దాఖలు!
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌)లో బుధవారం నామినేషన్ల సందడి జోరుగా నెలకొంది. పార్టీ అధ్యక్షుడు కేసిఆర్‌ సహా పలువురు మంత్రులు, కీలక నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నుంచి కేసిఆర్‌ బరిలోకి దిగారు. ఆయన తన నామినేషన్‌ పత్రాన్ని గజ్వేల్‌ ఆర్డీవో కార్యాలయంలో మధ్యాహ్నం అందజేశారు. కేవలం రెండు వాహనాల్లో కార్యాలయానికి వచ్చిన ఆయన స్థానికులతో కలిసి మధ్యాహ్నం 2.34 నిమిషాలకు నామినేషన్‌ దాఖలు చేశారు. నకలు కాపీలను వెంట తీసుకెళ్లకపోవడం, కాన్యా§్‌ులోని మరో వాహనంలో నామినేషన్‌ రెండో సెట్టు ఉండటంతో దానిని అప్పటికప్పుడు కార్యాలయానికి రప్పించారు.
సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మంత్రి తన్నీరు హరీష్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ దాఖలుకు ముందు ఆయన ఈద్గా, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మీ ఇంటి ముందు అభివృద్ది, కంటి ముందు అభ్యర్థిని చూసి ప్రజలు ఓటు వేయాలని ఆయన కోరారు. భూపాలపల్లి నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ సిరికొంద మధుసూదనాచారి నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా తన స్వగ్రామం నర్సక్కపల్లెలో ఆయన తన తల్లిదండ్రులు చిత్ర పటలకు నివాళులర్పించారు. ఆనంతరం ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలకు దాఖలు చేశారు. చెన్నూరులోని ఎంపీ బాల్క సుమన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈకార్యక్రమంలో మరో ఎంపీ వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. తాండూరులో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి, పరిగిలోని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల మహేష్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.
కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నిజామాబాద్‌ ఎంపీ కవితతో కలిసి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. తొలుత ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయాలని అనుకుని అన్ని సిద్దం చేసుకున్న తర్వాత సమయం చాలక నేరుగా మెట్‌పల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి విద్యాసాగర్‌రావు నామినేషన్‌ పత్రాలను కవిల సబ్‌ కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్బంగా చెరుకు రైతులుఎంపీ కవితను అడ్డుకునేందుకు సబ్‌కలెక్టర్‌ కార్యాలయానికి కొద్ది దూరంలో జాతీయ రహదారిపై వేచి చూశారు. ఇంతలో ఆమె కారు జగిత్యాల వైపు వెళ్లి పోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెనుదిరిగారు.
జడ్చర్లలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి లక్ష్మారెడ్డి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌ నామినేషన్‌ దాఖలు సందర్బంగా ఎల్లమ్మ దేవాలయం, చర్చి, షానాహెబ్‌ గుట్ట దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అచ్చంపేటలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గువ్వల బాలరాజు, దేవరకద్రలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్‌లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గద్వాలలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.