త్రిపురాసుర సంహారం

Tripuraasura samhaaram

తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేవారు తారకాసురుని కుమారులు. తారకాసురుడు మరణించిన తరువాత వీరు గత వైభవాన్ని పొందగోరి బ్రహ్మను గురించి తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకొమ్మన్నాడు. ఏ విధంగా కూడా వారికి మృత్యువు రాకూదడని వరం కోరారు అసురులు. అది అసాధ్యమని విధాత వారికి వివరించాడు. మీరు మరేదైనా వరం కోరుకోండి. దానిని అనుగ్రహిస్తాను అన్నాడు బ్రహ్మ. సోదరులు ముగ్గురు తీవ్రంగా ఆలోచించి ఓ విచిత్రమైన కోరికను కోరుకొందామనుకున్నారు.

వాళ్ల ముగ్గురికి ఒక్కొక్క వరం ఇవ్వమని అడిగారు. వారు మూడు పురాలలో నివసించుతామని అన్నారు. ఆ పురాలు బంగారం, వెండి, ఇనుములతో నిర్మితమై ఉండాలి. కాలగమనానికి అనుకూలంగా ఉండి తిరుగుతూ ఉండాలి. వాటిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో ఉండేలా ఏర్పాటు జరగాలి. అప్పుడు రథం కాని రథంలో వచ్చి విల్లుకాని విల్లుతో వాలు కాని వాలుతో ఈ మూడు పురాలను ఒక్కసారిగా కాల్చి చంపితే తప్ప తాము మరణించకూడదని అంతవరకు తాము బ్రతికి ఉండాలని కోరుకున్నారు.

వారి అజ్ఞానానికి నవ్వుకున్న చతుర్ముఖుడు మీ కోరిక నెరవేరుతుందని అభయం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు మయుణ్ణి పిలిపించి అలాంటి పురాలను తయారు చేయించి వారికి వరాలను ప్రసాదించాడు. ఆ మూడు పురాలు ఒకదానితో ఒకటి కలవకుండా ఉన్నంత కాలం వారు ఎవరి చేతా ఓడించబడరనీ వారు ముగ్గురూ కలిస్తే బలహీనులవుతారని చెప్పాడు.

అప్పుడు వారిని మృత్యువు కౌగలించుకొంటుందని హెచ్చరిక చేశాడు. అంతలో తారకాక్షుని కుమారుడు హరి అనేవాడు విష్ణుమూర్తిని ప్రార్థించి తమ వారిలో ఎవరు చనిపోయినప్పటికీ వారి శరీరాలు నీటిలో తడవగానే వారు బ్రతికేటట్లుగా ఒక్కొక్కరు పదిమందిగా వచ్చేటట్లుగా చేయగల ప్రభావంతో కూడిన జలయుత కూపాలను తమ నగరంలో నిర్మించమని కోరాడు. విష్ణువు వరాన్ని అనుగ్రహించాడు. దానితో అసురుల ఆగడాలు మిక్కుటమయ్యాయి. మదంతో దానవులు చరించసాగారు. త్రిపురాసురులు వరగర్వంతో లోకాలన్నీ తిరుగసాగారు.

సాధువులను సజ్జనులను మునులను, మహర్షులను హింసించడం మొదలు పెట్టారు. దేవతలందరు చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోయారు. మానవులు మునులు అల్లకల్లోలానికి అతలాకుతలం అవసాగారు. వీరి హింసను భరించలేని వారు శివుణ్ణి వేడుకున్నారు. దేవతంలా తమ బాధను బ్రహ్మతో మొరపెట్టుకొన్నారు. బ్రహ్మదేవుడు వారిని తీసుకుని శివుని దగ్గరకు వెళ్లాడు. త్రిపురాసురులు ఆగడాలను వివరించారు.

తమను కాపాడమని శివుణ్ణి ప్రార్థించారు. వారి బాధను చూడలేని భక్తదయాళువైన శివుడు అభయం ఇచ్చాడు. ఆ త్రిపురాసురులను సంహరిస్తానని అన్నాడు. అసురుల హింసను భరించలేని ముల్లోకవాసులు శివధ్యానం చేయసాగారు. శివనామం అన్ని లోకాలలో దద్దరిల్లింది. ఆనామోశ్చరణ విని అసురులు భయపడ్డారు. కాని వారికి బ్రహ్మ ఇచ్చిన వరంతో అహంకారాంధకారంలో మునిగిపోయి లోకాలన్నింటిని అతలాకుతలం చేయసాగారు.

దానిని చూసిన పరమశివుడు కోపోద్రిక్తుడయ్యాడు. త్రిపు రాసురుల కోరిక ప్రకారమే శివుడు వారిని సంహరించడానికి బయలుదేరాడు భూమి రథంగాను, వేదాలు గుర్రాలుగాను, సూర్యచంద్రులు చక్రాలుగాను, బ్రహ్మను రథసారథిగాను తయారు అయ్యారు.

ఉదయాస్త చలాలు నాగాలైనాయి. మంత్రాలు ఘంటలు కాగా మందరాద్రి చోటుగా ఆకాశం టెక్కెంగా, స్వర్గ మోక్షాలు ధ్వజంగా, దిక్కులు పాదాలుగా అనంతుడు బంధంగా, వేల్పులు రశ్మిధారులుగా బంగారు కొండ విల్లుగా శేషుడు నారిగా, సర్వస్వతి ఘంటగా, నారా యణుడు బాణంగాను అగ్ని శల్యంగాను, తారలు గుర్రాల అభరణాలుగా మహర్షులు గుర్రపు రౌతులుగా, విషయావులను సైనికులుగాను కూరారు.

ఆ రథాన్ని తన యుద్ధ రథం చేసుకున్నాడు ఆ శివుడు. ఆ రథాన్ని అధిరోహించి విచిత్రమైన విల్లులతో శివుడు పోరి త్రిపురాసులను భస్మం చేశాడు.ఈ విధంగా త్రిపురాసుర సంహారం చేసి శివుడు త్రిపురాంతకుడైనాడు. త్రిపురాంతక శివనమో నమో అనికీర్తింపబడుతున్నాడు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/