ఎక్కడున్న ఆదివాసీలు అక్కడే ఉన్నారు

Trible people
Trible people

ఎక్కడున్న ఆదివాసీలు అక్కడే ఉన్నారు

మాయదారి ఎన్నికలు మళ్లీ వచ్చాయి. ఆంధ్రఅగ్రవర్ణ గిరిజనేతరులు, తెలంగాణ రాష్ట్ర గిరిజనేతరులు అడ్డగోలుగా దోచుకొని తిని మళ్లీ దోచుకోవడానికి గిరిజనేతర రాజకీయ పార్టీలు, గిరిజనేతర ప్రజాసంఘాలు ఆదివాసీ సమాజంలోకి వస్తున్నాయి. అగ్రకుల సంపన్నులు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లుపెట్టుబడిదారులు, పెద్ద భూస్వాములు నుంచి మొదలుకొని వీధి రౌడీల వరకు అందరూ ఎత్తుపై ఎత్తులతో రంగురంగు జెండాలతోవస్తున్నారు. 70 ఏళ్లుగా రాజకీయ పార్టీలు ఇదే అబద్దపు హామీలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు.

గిరిజనేతర పార్టీలలో చేరి ఎమ్మెల్యే, ఎంపిలై ఆదివాసీచట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. ఓట్లేసినా ఆదివాసీల బతుకులు మాత్రం మారలేదు. సంపన్న భారతదేశంలో శతకోటి దరిద్రులుగా ఆదివాసీల జీవితాలు మారాయి. స్వాతంత్య్ర భారతదేశంలో ఆదివాసీల జీవన విధానం ఏం మారింది? ఎక్కడ మారింది? ఈ గిరిజనేతర రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆదివాసీల చట్టాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆదివాసీల అస్థిత్వాన్ని కాపాడేవారికే ఓట్లు వేస్తామని నేడు ఆదివాసీలు నిర్ణయించు కున్నారు. పార్టీల విధానాలు మారనంతకాలం ఆదివాసీలు మారరు. జెండాలు మారినంత మాత్రాన ప్రజలకు దక్కేది ఏమీ ఉండదు. ఆదివాసీల ఉమ్మడి రాజకీయ చైతన్యమే ఆదివాసీ స్వయం పాలనకు దోహం చేస్తుంది. ఓట్లు అడిగే నేతలు ఆదివాసీలకు జల్‌జంగిల్‌ జమీన్‌పై సంపూర్ణ అధికారం ఆదివాసీలకు ఉండేలా చేయాలి. ఎస్టీ జాబితా నుండి లంబాడీలనూ తొలగించాలి. ఎస్టీ జాబితాలో ఏ ఇతర కులాలనూ కలపకుండా చట్టం తీసుకురావాలి. ఐటిడిఎలో ఐఎఎస్‌పిఒనుండి అటెండర్‌ వరకు ఆదివాసీలనే నియమించాలి. ఏజెన్సీలో గిరిజనేతరుల ఓటు హక్కు రద్దు చేయాలి.

1/70, పీసా, అటవి హక్కుల చట్టం అమలు చేయాలి. ఏజెన్సీలో భూ దురాక్రమణపై కమిటీ వేయాలి. ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా కలిపి స్వయం పాలన కల్పించాలి. ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ నిధులు సంపూర్ణంగా ఆదివాసీలకే కేటాయించాలి. గొండు, కోయ వారికి పదో తరగతి వరకు వారి మాతృభాషలోనే బోధన చేయాలి. జిఒనెం.3ని అమలు చేయాలి. ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలు విచ్ఛిన్నం చేసే హిందూ మతోన్మాద సంస్కృతిని అరికట్టాలి. ఇంద్రవెల్లి అమరుల స్థూపంపై ఆంక్షలను ఎత్తివేయాలి. స్థూపం నిర్వహణ బాధ్యత ఆదివాసీ సంఘాలకు అప్పగించాలి. కవ్వాల్‌, టైగర్‌జోన్‌, కుంటాల జలపాతంపై జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, వివిధ రకాల పథకాల ద్వారా ఆదివాసీలను నిర్వాసితులు చేసే ప్రక్రియను రద్దు చేయాలి. అన్ని ఏజెన్సీ జిల్లాలో ప్రతి సంవత్సరం ఏజెన్సీ డిఎస్సీ, ఏజెన్సీపోలీసు రిక్రూట్‌మెంట్‌, ఏజెన్సీ గ్రూపు-1,2, ఏజెన్సీ సివిల్‌ సర్వీస్‌ ఏర్పాటు చేయాలి.

– వూకె రామకృష్ణ దొర