నాగర్ కర్నూల్ లో అమానవీయ ఘటన

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు దుర్మార్గులు గత పది రోజులుగా ఓ ఇంట్లో చెంచు మహిళను నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వాతలు పెట్టారు. దీనికి సంబదించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈదన్న ఈశ్వరమ్మలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో ఈశ్వరమ్మ ఊరు విడిచి వెళ్ళింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో తనకు తెలిసిన వారితో భర్త వాకప్ చేశాడు. కాట్రాసు ఈదన్నకు ఉన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ,బండి శివుడులు కౌలు తీసుకొన్నారు. అయితే సదరు కౌలుదారులు ఆ చెంచు దంపతులను తమ పొలం వద్దనే జీతం పెట్టుకున్నారు. కాగా ఈశ్వరమ్మ జాడ తెలుసుకున్న బండి వెంకటేష్ ,బండి శివుడులు.. రహస్యంగా బైకుపై మొలచింతపల్లి గ్రామానికి తీసుకొస్తూ మార్గమధ్యంలో చితకబాది ఓ ఇంట్లో నిర్బంధించారు. అయితే దుర్మార్గులు ఇంతటీ ఆగకుండా ఆదివాసి మహిళ ఈశ్వరమ్మను వివస్త్ర చేసి చిత్రహింసలకు గురిచేసి, ఆ తరువాత శరీరంపై వాతలు పెట్టి పచ్చికారం నూరి శరీరంపైన, కళ్ళలోనూ, మర్మాంగంలోనూ చల్లారు. ఆ మంటలకు తాళలేక బాధితురాలు రోదించినప్పటికీ చుట్టుపక్కల ఇళ్ల వారు స్పందించకపోవడం విచారకరం. అయితే ఇంత జరిగినప్పటికీ గాను తన భార్య ఈశ్వరమ్మ ఆచూకీ మాత్రం భర్త ఈదన్నకు తెలియ రాలేదు. తన భార్య గత పది రోజుల నుంచి కనబడడం లేదని భర్త ఈదన్న గ్రామస్తులకు తెలపడంతో ఈ పాశవీక చర్య ఆనోటా ఆనోటా బుధవారం బయటపడింది.

గ్రామస్తులు పోలీసులకు బుధవారం సాయంత్రం సమాచారం అందించారు. దీంతో కొల్లాపూర్ పోలీసులు గ్రామానికి చేరుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కొల్లాపూర్ ఎస్సై హృషికేష్ తెలిపారు.