వ్యాక్సిన్‌ కోసం యూకేకు భారతీయుల పరుగులు

టీకాను ప్రజలకు ఇచ్చేందుకు బ్రిటన్ అనుమతి

indian-millionaires-want-to-go-london-for-vaccine

న్యూఢిల్లీ: కరోనా నియత్రణ కోసం ఫైజర్‌ తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వాలని బ్రిటన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలోనే భారతీయుల్లో ఎక్క‌డ లేని ఉత్సాహం క‌నిపించింది. చాలా మంది యూకే వెళ్లి.. వ్యాక్సిన్ వేసుకోడానికి రెడీ అయిపోతున్నారు. ఈ మేరకు ట్రావెల్ ఏజన్సీలను సంప్రదిస్తూ, లండన్ కు వెళ్లేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

లండన్ లో వచ్చే వారంలో ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభం కానుండగా, ఇప్పటికే భారత్ కు చెందిన ఓ ట్రావెల్ ఏజంట్, మూడు రాత్రుల ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. తాము యూకే వెళితే వ్యాక్సిన్ ను ఎక్కడ, ఎప్పుడు ఎలా తీసుకోవచ్చని తమను ఎంతో మంది అడుగుతున్నారని ముంబైకి చెందిన ఓ ప్రముఖ ట్రావెల్ ఏజంట్ పీటీఐకి వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేమని మాత్రమే తాము సమాధానం ఇస్తున్నామని, ఇక్కడి నుంచి వెళ్లే ఇండియన్స్ కు వ్యాక్సిన్ ఇస్తారా? అన్న విషయంపైనా ఇంకా సమాచారం లభించలేదని ఆయన తెలిపారు.

కాగా, బ్రిటన్ లోనూ తొలి దశలో వయో వృద్ధులకు, హెల్త్ వర్కర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారని అక్కడి అధికారులు అంటున్నప్పటికీ, ఎలాగైనా వెళ్లి వ్యాక్సిన్ తీసుకుని వచ్చేద్దామని భావిస్తున్న కోటీశ్వరుల సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ఇదే విషయమై స్పందించిన ‘ఈజ్ మై ట్రిప్ డాట్ కామ్’ సహ వ్యవస్థాపక సీఈఓ నిశాంత్ పిట్టి, వాస్తవానికి లండన్ ప్రయాణాలకు ఇది సీజన్ కాదని, అయినా, బుధవారం నాటి ప్రకటన తరువాత యూకే వీసాలు కలిివున్న వారు, లండన్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని రావాలని భావిస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. ఈ విషయంలో బ్రిటన్ ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఇండియన్ పాస్ పోర్టు ఉన్నవారు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటిస్తే, ఇక్కడి నుంచి వందల సంఖ్యలో టికెట్లు లండన్ కు బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

కాగా, ప్రస్తుతం ఇతర దేశాల నుంచి లండన్ కు ఎవరు వెళ్లినా, ఐదు రోజుల సెల్ఫ్ ఐసొలేషన్ తప్పనిసరన్న సంగతి తెలిసిందే. ఆపై ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తరువాతే దేశంలో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/