శాంత స్వభావం

శాంత స్వభావం
The Ramayana

రామాయణ బాలకాండలో అరణ్యకాండలోనూ మారీచుడు మనకు కనబడతాడు. బాలకాండలోని మారీచుడు కేవల పిశితాశనుడు. విశ్వామిత్రుని యజ్ఞకుండంలో సోదరునితో కలిసి మాంసం క్రుమ్మరించిన తమోగుణ ప్రధానుడు. బాలకాండలోని మారీచుడు అరణ్యకాండలోకి వచ్చేటప్పటికి మనకు అగుపించడు. వివేచనా జ్ఞానం కలిగి ధర్మాధర్మమును చెప్పగల శాంత స్వభావుడుగా పాఠకులకు గోచరిస్తాడు.

ఇది రామబాణఘాత ప్రభావం. సుభాహుడిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించటంతో బాలకాండలో అతని అధ్యాయం ముగిసింది. కాని అదే బాణాన్ని మారీచునిపై సంధించలేదు. బాలుడైన రాముడు మరో బాణం ప్రయోగించడంతో ఆ రాక్షసుడు శతయోజన దూరం ఎగిరి సముద్రంలో పడి తప్పించుకుని దండకారణ్యం చేరి ఒక ఆశ్రయం నిర్మించుకుని సాధుశీలగా కాలం గడుపుతూ ఉంటాడు. కాలం గడపడం, శూర్ఫణఖా పరాభవం ప్రతీకారం తీర్చుకొనదలచిన రావణునికి తన కార్యసాధనకు మారీచుడు తప్ప మరొకరు సమర్ధుడు కాడని నిర్ణయించుకుని మారీచాశ్రమం చేరడంలో మారీచుని మానసిక పరివర్తన మనకు అర్ధమవుతుంది.

సీతాపహరణ అనే నీవు చేసి పెట్టాలి అని రావణుడు అనగానే శ్రీరాముని పరాక్రమం గుర్తుకు తెచ్చుకున్న మారీచుడు రావణుని మనసు మరల్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంగా ఎన్నో నీతి వాక్యాలు పలికిన మారీచుడు అందరూ ప్రియవాక్యాలు పలుకుతారేగానీ, ఎదుటి వ్యక్తికి వేలు కలిగే అప్రియ వాక్యాలు నిజాలు చెప్పే వాళ్లు లోకంలో దుర్గభం అవుతున్నారు అంటాడు. ఒక చెరువులో పాము, చేపలు ఉంటే దాన్ని పట్టటానికో చంపటానికో ముందు ప్రయత్నంలో చేప నశిస్తుంది. ఇక్కడ రావణుని సర్పంతో పోల్చి అన్యాపదేశంగా తాను చేపవలె నశించబోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తాడు.

ఎంత చెప్పినా రావణుని నిర్ణయం మారలేదు. సరికదా నీవు రాముని వద్దకు వెళ్లితే బ్రతికినా బ్రతకవచ్చు. కాని నామాట వినకపోతే నీకిప్పుడే మరణం తథ్యం అన్నప్పుడు మార్గాంతరం లేక రావణుని చేతిలో మరణం కన్నా శ్రీరాముని చేతిలో పరలోకం చేరడం మేలని నిర్ణయించుకున్న మారీచుడు లోకోత్తరుడే. రామాశ్రమ ప్రాంతం చేరుకున్న లేడి రూపంలోని మారీచుడు ఇతర లేళ్లను గమనిస్తాడు. కాని అవి ఎందుకో వాసన చూసి మన జాతి ప్రాణి కాదన్నట్లు దూరదూరంగా వెడుతుంటాయి.

అసలు రాక్షస ప్రవృత్తి జంతువులను చంపి తినడం. కాని తన సహజ లక్షణాన్ని ప్రక్కకు నెట్టి సీతను ఆకర్షించడానికి మాత్రమే యత్నిస్తాడు మారీచుడు. ఏదైనా పొరపొటు చేస్తే ఇబ్బంది అన్నట్లు పాండవులు అజ్ఞాతవాసంలో చూపిన మెళకువలలో స్వామి కార్యం సాఫల్యానికి యత్నిస్తాడు మారీచుడు. కధాంతం కాబోతున్నది. రామబాణం తనకు తగిలింది. తను మరణిస్తానని తెలుసు అయినా మారీచుడు యజమాని ఉప్పు తిన్నందున చివరియత్నంగా రాముని కంఠధ్వనితో హా లక్షణా, హా సీతా అని ఆక్రందిస్తాడు. మాయావియైన మారీచునకు రూపం మార్చుకోవడం కంఠధ్వని మార్చుకోగల శక్తి యుక్తులు కూడా ఉన్నాయి.

ఇది మారీచుడు ప్రయోగించిన చివరి అస్త్రం. తాను మరణించినా ప్రభుకార్యసాఫల్యంలో చివరి వరకు యత్నించి కృతకృత్యుడైనాడు మారీచుడు. రాముడు ఆశ్రమంలో ఉన్నంత వరకు సీతను అపహరించడం ఎవరికీ సాధ్యం కాదు.

కాబట్టి ఈ ప్రయత్నం చెయ్యవలసి వచ్చింది. ఈ విధంగా సీతాపహరణకు మారీచుడే సాధనమైనా తన ఇష్టానికి విరుద్ధంగా వర్తించానని అతనికి బాగా తెలుసు. మనస్సాక్షిగా ఈ పని ఇష్టం లేకపోయినా పరిస్థితులకు బానిస అయినట్లు విధిలేకనే ఇందుకు ఉద్యుక్తుడయినట్లు రామాయణం ద్వారా తెలుస్తున్నది.

రామడంటే తనకు ఎంత భయమో అతని మాటలోనే వినవచ్చు. ర అనే అక్షరంతో మొదలయయ్యే రాముడే కాదు రత్నాలు, రథాలు అంటే కూడా నాకు భయమే అంటాడు.

రావణుడు నీచపు పనికి ఆదేశించగానే మారీచుని ముఖం ఎండిపోయింది. పెదవులు ఆరిపోయాయి. అవి మేఘాలవలె కనుగుడ్లు కదలడం మానవవేశాయి. ఈ అవలక్షణాలన్నీ కాలం సమీపించిన వారిలో కనిపించే లక్షణాలే. ఒకవేళ మారీచుడే ఈ పని నేను చెయ్యనని అంటే రావణుని చేతిలో మరణం పొందేవాడే. రావణుడు తన పనికి మరొకడిని వినియోగించేవాడే. కానీ తన వంతు ధర్మం నిర్వర్తించి ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరిస్తాడు మారీచుడు.

తన కార్యసాధనకు ముందు ఈ ప్రయత్నం మానుకొనకపోతే దగ్ధభవనాలతో కూడిన లంకానగరాన్ని చూస్తావు అన్న మారీచుడి మాటలు, మారుతి లంకాదహనంతో .ఇజమవుతాయి. ఈ విధంగా భవిష్యత్తును దర్శించిన ద్రష్ట కూడా మారీచుడు. పథక రచనలోగానీ ప్రణాళికను పకడ్బందీగా అమలు పరచడంలోనూ తనకు తానే సాటి మారీచుడు. రామ పరాక్రమ ప్రభావాన్ని బాగా ఆకళింపు చేసుకున్న స్వామి భక్తి పరాయణుడు మారీచుడు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/