స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులకు టీజేఎస్‌ శిక్షణ

TJS
TJS

హైదరాబాద్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ జన సమితి పక్షాన పోటీ చేయనున్న అభ్యర్థులకు ఆ పార్టీ నేతలు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమతమ స్థానాల నుంచి దరఖాస్తు చేసుకోగా వారిలో కొందరిని ఎంపిక చేసి ప్రొ.జయశంకర్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం మొదటి బ్యాచ్‌ అభ్యర్థులకు స్థానిక సంస్థలు, అధికారాలు, చట్టాలు అంశాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ స్థానిక సంస్థలలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు వాటిపై అవగాహన ఉండాలన్నారు. కేవలం రాజకీయ అధికారం కోసం కాకుండా ఆయా ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ? వాటిలో ప్రజలకు ఏ విధమైన భాగస్వామ్యం ఉండాలి ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్ని నిధులు వస్తాయి ? వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలి ? అనే అంశాలపై వివరించారు. మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థలతో ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనీ, ఈ శిక్షణ శిబిరాలలో ఆయా అంశాలపై అనుభవజ్ఞులైన నిపుణులచే అవగాహన కలిగించారు. అయితే, దీనికి ఆయా అభ్యర్థులకు తగిన అనుభవం, అవగాహన ఉండాలన్నారు. ఈ శిక్షణ తరగతులలో టీజేఎస్‌ నేతలు విద్యాధరరెడ్డి, బైరి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.