నేడు విజయవాడ లో ట్రాఫిక్ ఆంక్షలు..

సీపీఐ జాతీయ మహాసభల నేపథ్యంలో ఈరోజు విజయవాడ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌లో మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. మీసాల రాజారావు బ్రిడ్జి మీదుగా పై వంతెన, డాబాకొట్లు సెంటరు, మాకినేని బసవపున్నయ్య స్టేడియం వరకు సుమారు 25వేల మందితో ప్రదర్శన ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సీతన్నపేట నుంచి బుడమేరు వంతెన కూడలి వరకు ఎలాంటి వాహనాలను అనుమతించమన్నారు.
ఏలూరు లాకులు నుంచి సీకేరెడ్డి రోడ్డు, జీఎస్‌రాజు రోడ్డులోకి, బుడమేరు వంతెన వైపు, ప్రభుత్వ ముద్రణాలయం వైపు కూడా అనుమతి లేదని తెలిపారు. అలాగే రైల్వేస్టేషన్ నుంచి అజిత్‌సింగ్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను ఏలూరు లాకులు, అలంకార్ కూడలి, గుణదల సెంటరు, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు మీదుగా కండ్రిక వైపు వెళ్లాలని సూచించారు. అలాగే చిట్టినగర్ నుంచి ఎర్రకట్ట మీదుగా వచ్చే వాహనాలను కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా.. సీవీఆర్ బ్రిడ్జి మీదుగా వై.వి.రావు ఎస్టేట్, పైపుల రోడ్డు మార్గంలో వెళ్లాలని , నూజివీడు వైపు నుంచి కండ్రిక కూడలి మీదుగా వచ్చే వాహనాలు కండ్రిక జంక్షన్ వద్ద మళ్లించి ఇన్నర్‌రింగ్ రోడ్డు, రామవరప్పాడు రింగ్ మీదుగా విజయవాడకు రావాలని తెలిపారు. ఇక సీపీఐ సభలకు వచ్చేవారు ఇబ్రహీంపట్నం వైపు వచ్చే వాహనాలు గొల్లపూడి బైపాస్, సీవీఆర్ బ్రిడ్జి, వై.వి.రావు ఎస్టేట్ మీదుగా ఎక్సెల్ ప్లాంటు రోడ్డులో నిలపాలని సూచించారు.