గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ లో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు

గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ లో రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. శుక్రవారం, శనివారం జరగనున్న గణేష్ శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. సెప్టెంబరు 9,10 రోజుల్లో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో రహదారులు మూతపడనున్నాయి.

ఆ వివరాలు చూస్తే..

కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు… JNTU, ఫోరమ్ మాల్ రోడ్డు మీదుగా వెళ్లాలి. హైటెక్ సిటీ, మాదాపూర్ నుండి కైతలాపూర్ మీదుగా కూకట్‌పల్లి ‘వై’ జంక్షన్‌కు వెళ్లే వాహనాలను రెయిన్‌బో విస్టా – మూసాపేట్ రోడ్డులోకి మళ్లించారు. ఆల్వాల్‌ హస్మత్‌పేట్ చెరువులో వినాయక నిమజ్జనాల కోసం ఆ రూట్ లో సాధార‌ణ వాహ‌నాలను అనుమతి లేదు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి, ఇతర కాలనీల నుంచి గణేష్ విగ్రహాలను తీసుకువెళ్ళే వాహనాలు అంజయ్యనగర్ మీదుగా హస్మత్‌పేటకు రావాలని పోలీసులు సూచించారు.

నిమజ్జనం తర్వాత పాత బోయిన్‌పల్లి, మసీదు రోడ్డు, హరిజన బస్తీ మీదుగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. సూరారం కట్టమైసమ్మ ట్యాంక్ లో వినాయక నిమజ్జనాలు ఉండటంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాలానగర్‌, జీడిమెట్ల నుంచి బహదూర్‌పల్లి, బాచుపల్లి, గండిమైసమ్మ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను.. బౌరంపేట, గండిమైసమ్మ సమీపంలోని సూరారం మీదుగా మళ్లిస్తారు. గండిమైసమ్మ, బాచుపల్లి నుంచి జీడిమెట్ల, బాలానగర్‌ వైపు వెళ్లే వాహనాలు బహదూర్‌పల్లి జంక్షన్‌ వద్ద ఎడమవైపు తిరిగి.. దూలపల్లి జంక్షన్‌ మీదుగా వెళ్లాలి.

దుర్గం చెరువులో నిమజ్జనాల కోసం మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్, సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లై ఓవర్‌, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం 45 ఫ్లై ఓవర్‌ పై వినాయక విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలను అనుమతించరు. దుర్గం చెరువు వంతెన, బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్, మల్కంచెరువు ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్, షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పైనా వాహనాలను అనుమ‌తించ‌రు.