రేపు రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాజ్ భవన్లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అధికారులు రాజ్ భవన్ కు ఇరువైపులా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజీగూడ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, రాజ్ భవన్ మెట్రో రెసిడెన్సీ, ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ జంక్షన్ వరకు ట్రాఫిక్ జాం ఉంటుందని పోలీసులు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని, పోలీసులకు సహకరించాలని కోరారు.

మరోపక్క గణతంత్ర వేడుకల నిర్వహణ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరేడ్‌తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది . కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తెలంగాణ పాటించాలని ఆదేశించింది. అయితే పరేడ్ ఎక్కడ నిర్వహించాలన్నది ప్రభుత్వ ఇష్టమని చెప్పింది న్యాయస్థానం. కరోనా కారణంగా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించడం లేదని ఏజీ చెప్పినా కోవిడ్ ప్రోటోకాల్ జీవో సమర్పించలేదని అభిప్రాయపడింది హైకోర్టు.