సంక్రాంతి ఎఫెక్ట్ : సొంతఊర్లకు పరుగులు పెడుతున్న సిటీ వాసులు

సంక్రాంతి వస్తుందంటే చాలు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు పయనం అవుతారు. ఈ సంక్రాంతి కి కూడా అలాగే వెళ్తున్నారు. నగరవాసులంతా పల్లె బాట పట్టారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ప్రజలు వారి వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో రైల్వే, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టోల్​ప్లాజాల వద్ద వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోతున్నాయి. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే తో పాటు టీఎస్ , ఏపీఎస్ ఆర్టీసీ లు ప్రత్యేక బస్సులు ఏర్పటు చేసాయి.

దక్షిణ మధ్య రైల్వే సైతం ..105 ప్రత్యేక రైళ్లు, 197 ట్రిప్పులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 37 రైళ్లను.. 92 ట్రిప్పులుగా నడిపించనున్నారు. ఇతర జోన్‌ల నుంచి… 29 రైళ్లతో 38 ట్రిప్పులు నడిపించనున్నారు. అలాగే టీఎస్ ఆర్టీసీ సైతం..హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి కోసం 4, 318 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడంలేదని టీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం సైతం కల్పించినట్లు పేర్కొన్నారు.