ఆమెజాన్‌ గో బ్యాక్‌..ప్లిప్కార్ట్‌ గో బ్యాక్‌..


ఢిల్లీలో రోడ్డెక్కిన వర్తకులు

amazon & flipkart
amazon & flipkart

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజాలు ఆమెజాన్‌, ప్లిప్కార్ట్‌లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో వర్తకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశంలో ఎంపిక చేసిన కొన్ని చిన్న తరహా కంపెనీలను ఫీజు చెల్లించి మరీ ఆమెజాన్‌, ప్లిప్కార్ట్‌ లిస్ట్‌ చేయాలని ప్రభుత్వం భావించటమే. అందుకు అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం భరించేలా నిర్ణయం ఉండబోతుందని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ నిర్ణయాన్ని వర్తకుల సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకించింది. చిన్న కంపెనీలకు మేలు చేసే పేరుతో, దొడ్డి దారిన ఈ కామర్స్‌ కంపెనీలకు ప్రభుత్వం నిధులు చెల్లించాలని చూస్తోందని ఆరోపించింది. ఆమెజాన్‌ వంటి కంపెనీలు పెట్టుబడులు సహా అనేక నిబంధనలను తుంగలో తొక్కుతూ అనేక దేశాల్లో భారీ పెనాల్టీలకు గురవుతోందని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద గుమికూడిన వర్తకులు ఆమెజాన్‌..ప్లిప్కార్ట్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేసినట్లు ఎంట్రాకర్‌ వెల్లడించింది. తమ నిరసనలతో ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే..నిరసనలు మరింత ఉధృతం చేస్తామని సిఏఐటి పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/