టీపీసీసీ చీఫ్ రేవంత్‌ హౌస్ అరెస్ట్

కోకాపేట భూముుల సందర్శన, ధర్నాకు పిలుపు నేపథ్యంలో గృహ నిర్బంధం

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఈ తెల్లవారుజామున మూడు గంటల నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రేవంత్‌ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఆయనను గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తెల్లవారుజామునే చేరుకున్న పోలీసులు అక్కడి నుంచి ఎవరూ కదలకుండా అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఈ ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కూడా కోకాపేట భూముల సంద్శనకు వెళ్లడానికి సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భూముల సందర్శనకు వెళ్లే నేతలను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు భారీగా మోహరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/