సూసైడ్ బాంబర్లపై తాలిబన్ మంత్రి ప్రశంసలు

125 డాలర్లు, ఓ ఫ్లాట్.. సూసైడ్ బాంబర్లకు మంత్రి బంపరాఫర్

కాబుల్: ఆత్మాహుతి దాడులతో వందలాదిమంది ప్రాణాలను బలిగొంటున్న సూసైడ్ బాంబర్లపై తాలిబన్ మంత్రి ప్రశంసలు కురిపించారు. వారు అమరవీరులంటూ కొనియాడారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో నిన్న జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆఫ్ఘన్ హోంశాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబర్ల త్యాగాలు ఎనలేనివని ప్రశంసించారు. వారు ఈ దేశానికి, ఇస్లాంకు హీరోలని అభివర్ణించారు. వారి కుటుంబాలకు 10,000 ఆఫ్ఘానీలు (125 డాలర్లు), ఓ ఫ్లాట్ ఇస్తామని మంత్రి ప్రకటించినట్టు స్థానిక మీడియా ప్రముఖంగా ప్రచురించింది.

కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఇటీవల వరుస ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయి. ఈ నెల 8న కుందుజ్ ప్రావిన్స్‌లో, 15న కాందహార్‌లోని షియా మసీదులో జరిగిన ఆత్మహుతి దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. షియా ముస్లింలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/