తైవాన్‌ రక్షణ శాఖ కీలక అధికారి అనుమానాస్పద మృతి

క్షిపణుల తయారీ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న యాంగ్ లీషింగ్

Taiwan Flag
Taiwan Flag

తైపేః అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనతో తైవాన్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా ఆ ద్వీప దేశం చుట్టూ చైనా చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్‌ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తైవాన్ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన అభివృద్ధి విభాగం హెడ్ గా పనిచేసే యాంగ్ లీషింగ్ ఓ హోటల్ రూమ్ లో మరణించినట్టు గుర్తించారు. దక్షిణ తైవాన్ లోని పింగ్ టంగ్ పర్యటనలో ఇది చోటు చేసుకుంది. యాంగ్ లీషింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టడం గమనార్హం. పలు క్షిపణుల తయారీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు.

పింగ్ టంగ్ కంట్రీలోని హెంగ్ చన్ లో ఓ హోటల్ గదిలో యాంగ్ లీషింగ్ అచేతనంగా ఉండడాన్ని గుర్తించినట్టు నేషనల్ చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటన విడుదల చేసింది. మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, యాంజీనా పెక్టోరిస్ వల్ల మరణించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైనట్టు తెలిపింది. అయితే, యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/