రేపు ఉజ్జయినీ మహంకాళి బోనాలు..హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Bonalu festivities at Ujjaini Mahankali temple
Bonalu festivities at Ujjaini Mahankali temple

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి సోమవారం రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి పూజ ముగిసేవరకు టొబాకోబజార్‌ హిల్‌స్ట్రీట్‌ నుంచి జనరల్‌బజార్‌ వరకు, రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ నుంచి బాటా ఎక్స్‌రోడ్స్‌ వరకు, మహంకాళి ఆలయం నుంచి అడివయ్య క్రాస్‌రోడ్స్‌, జనరల్‌బజార్‌ వరకూ ఎలాంటి వాహనాలను అనుమతించబోమని, వాహనదారులు సహకరించాలని కోరారు. అలాగే, కర్బలామైదాన్‌ వైపునుంచి సికింద్రాబాద్‌ వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రాణిగంజ్‌ ఎక్స్‌రోడ్స్‌ నుంచి మినిస్టర్‌ రోడ్‌ మీదుగా రసూల్‌పురా, సీటీవో, వైఎంసీఏ క్రాస్‌రోడ్స్‌, సెయింట్‌జాన్స్‌ రోటరీ, గోపాలపురం మీదుగా సికింద్రాబాద్‌ చేరుకోవాల్సి ఉంటుంది.

సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆల్ఫాహోటల్‌ నుంచి, గాంధీ క్రాస్‌రోడ్స్‌, సజ్జన్‌లాల్‌ స్ట్రీట్‌, ఘాస్‌మండి, బైబిల్‌హౌస్‌ మీదుగా కర్బలామైదాన్‌ వైపునకు వెళ్లాలి. సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి సెయింట్‌మేరీస్‌ రోడ్‌లో వాహనాలకు అనుమతి లేదు. హకీంపేట, బోయినపల్లి, బాలానగర్‌, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లే బస్సులను క్లాక్‌టవర్‌ వద్దే నిలిపివేస్తారు. తిరిగి అక్కడి నుంచే బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని సీపీ అంజనీ కుమార్ కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/