కేజీ రూ. 20 కు పడిపోయిన టమాటా ధర..

నిన్నటివరకు కేజీ టమాటా ధర రూ. 100 – 120 పలుకగా..ఈరోజు రూ. 20 కు పడిపోయింది. ఇది చూసి సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో భారీగా టమాటా వచ్చింది. దీంతో టమాటా ధరలు భారీ స్థాయిలో పడిపోయాయి. 30 కిలోల బాక్సు రూ.600 పలికింది. రెండు రోజుల క్రితం వరకు అదే బాక్సు ధర రూ.3 వేలు దాటింది. బయటి రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో టమాటా రావడం తో టమాటా ధర తగ్గిందని వ్యాపారస్తులు చెపుతున్నారు.

టమాటా ధర ఆకాశాన్నంటడంతో రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని నిర్ణయించింది. అనంతపురంలో రైతుల నుంచి రూ. 50 చొప్పున కొనుగోలు చేసి మార్కెట్లో రూ. 55 చొప్పున విక్రయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కిలో టమాటా ధర రూ. 60 పలుకుతోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కేజీ రూ. 50 నుండి 70 వరకు పలుకుతుంది. మరో రెండు రోజుల్లో అన్ని చోట్ల టమాటా ధర భారీగా తగ్గడం గ్యారెంటీ అని తెలుస్తుంది.