రేపు జగన్ తో సమావేశం కాబోతున్న సినీ పెద్దలు

టాలీవుడ్ సినీ పెద్దలు రేపు (సెప్టెంబర్ 20) ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయం లో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో చర్చలు జరుపనుంది జగన్‌ సర్కార్‌. జగన్‌ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కొత్త సినిమాలకు బెనిఫిట్‌ షోలు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చిత్ర పరిశ్రమ పెద్దలు కోరనున్నారు.

నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే అవకాశం కల్పించాలని, గ్రేడ్‌-2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు పది రూపాయలు, కుర్చీకి 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయవద్దని సీఎంను కోరనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వమే నేరుగా సినీ టిక్కెట్ల ఆన్ లైన్ లో విక్రయించేందుకు వెబ్ సైట్ తీసుకువస్తామని ప్రకటించింది. ఈ విషయంపై చిరంజీవి బృందం తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి తెలిపే అవకాశం ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్‌ రాజు, సురేశ్‌బాబు ఇతరులు సీఎం జగన్ ను కలవనున్నారు.