వీరమరణం పొందిన సైనికులకు టాలీవుడ్ సెల్యూట్

త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఉండిపోతాయి..మహేశ్

Tollywood Celebrities Pay Tribute To Indian Army Martyrs

హైదరాబాద్‌: లడక్‌ సమీపంలోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేశారు.
‘గాల్వన్‌ లోయ వద్ద మన జవాన్లు అమరులయ్యారని తెలుసుకుని కలత చెందాను. వారి త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. మన యోధులకు, వారిలోని దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’ అని మహేశ్ బాబు పేర్కొన్నారు.

‘లడక్ ‌లో మన వీర జవాన్ల బలిదానం పట్ల మాటలు రావట్లేవు. దేశాన్ని కాపాడడం కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు నా సానుభూతి’ అని సాయితేజ్ ట్వీట్ చేశాడు.

‘బరువెక్కిన గుండెతో ఈ వార్త చదివాను. అమరవీరులకు సెల్యూట్’ అని సుధీర్ బాబు పేర్కొన్నాడు.

‘అమరులైన భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నాను. ఓం శాంతి.. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’ అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేర్కొంది.

‘మేము దేశంలో ప్రశాంతంగా ఉండగలగడానికి మీ శౌర్య, పరాక్రమాలే కారణం. థ్యాంక్యూ సెల్యూట్‌. ఇండియన్ ఆర్మీ జిందాబాద్’ అని అనసూయ ట్వీట్ చేసింది.


మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ సహా పలువురు సెలబ్రిటీలు కూడా దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించడంతో పాటు వారి సేవలను కొనియాడారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/