నేడు సిద్ధరామయ్య రాజీనామాపై అధిష్ఠానం నిర్ణయం

siddaramaiah
siddaramaiah

కర్ణాటక: ఇటీవల కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీఎల్పీ హోదాకు రాజీనామా చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ దినేశ్ గుండూరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాలను ఉపసంహరించుకోవాలంటూ నేతలు వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నా ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. కాగా, వీరి రాజీనామాలపై అధిష్ఠానం నేడు నిర్ణయం తీసుకోనుంది. కాగా, వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకునే ముందు పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో చర్చలు జరపాలని సోనియాగాంధీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అధిష్ఠానం పిలుపుతో శివకుమార్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు, పీసీసీ చీఫ్ పగ్గాలు శివకుమార్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నేడు పార్టీ సీనియర్ నేతలతో జరగనున్న సమావేశంలో రాష్ట్రంలోని కీలక పదవులపై అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/