నేడు బిజెపి అభ్యర్ధుల తొలిజాబితా

modi, amit shaw
modi, amit shaw


న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకుగాను భారతీయ జనతాపార్టీ మొదటి విడత జాబితాను శనివారం విడుదలచేస్తుందని చెపుతున్నారు. మొదటివిడతగా ఏప్రిల్‌ 11 వతేదీ జరిగే 91 స్థానాలకు చెందిన అభ్యర్ధులపేర్లే ఉంటాయని అంచనా. కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం మరోసారి సమావేశం అయి అభ్యర్ధులను నిర్ణయిస్తుందని పార్టీ నేతలు చెపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఇతర ఉన్నతస్థాయి బిజెపి నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. మొత్తం 543 నియోజకవర్గాలకు ఏడుదశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తుదివిడత ఎన్నికలు మే 19వ తేదీ జరగనున్నాయి. ఓట్లలెక్కింపు మే 23వ తేదీ జరగనున్న నేపథ్యంలో ఇపుడు బిజెపి అభ్యర్ధుల సంఖ్య కీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాస్ట్రాల్లోని 42 స్థానాలకు ఒకే విడతగా ఎన్నికలు జరుగుతున్నాయి. అందులోనూ మొదటిదశలోనే నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లోనికొన్ని నియోజకవర్గాలకుసైతం మొదటి విడతలోనే పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలోని అసెంబ్లీ ఎన్నికలుసైతం లోక్‌సభ ఎన్నికలతోపాటే జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేకమంది ఎంపి అభ్యర్ధులను మారుస్తారన్న ప్రచారం జోరందుకోవడంతో అభ్యర్ధుల్లో ఇపుడు ఉత్కంఠ పెరిగింది. సుమారు 91 మందికిపైగా అభ్యర్ధులకు గెలిచే అవకాశాలు లేవని వారందరినీ మార్చాలని బిజెపి హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొందరు సీనియర్లుఉండగా మరికొందరు 75 ఏళ్లకుపైబడినవారున్నారు. కేంద్ర మంత్రులు అయినా సరే నియోజకవర్గాల్లో పట్టులేనివారికి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత భేటీలోనే అనేకమంది సిట్టింగ్‌లకు బిజెపి హైకమాండ్‌ మొండిచెయ్యిచూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.