నేటితో దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్లు

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ దివిసీమ ఉప్పెన మిగిల్చిన విషాదాన్ని, ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. దివిసీమ ఉప్పెనకు నేటితో 43 ఏళ్లని, 1977 నవంబర్ 19 అర్ధరాత్రి సంభవించిన ఆ ప్రళయానికి 83 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయని, దాదాపు 20 వేల మంది చనిపోయారని అంచనా వేశారని ట్వీట్ చేశారు. ఇప్పటికీ ప్రతి ఏటా ఈ రోజున ఆ ప్రాంత ప్రజలు సంస్మరణ కార్యక్రమాలు చేసుకుంటారంటే అదెంత ఘోర విపత్తో తెలుస్తుందన్నారు.

ఆ రోజుల్లో సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ, తన సామాజిక బాధ్యతను విస్మరించకుండా సినిమా రంగాన్ని కూడదీసుకుని జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలను ఎన్టీఆర్ సేకరించారన్నారు. వ్యక్తిగతంగా ఎన్నో సహాయ కార్యక్రమాలలో పాల్గొని విరాళాలు అందించారన్నారు. తన తాత ఎన్టీఆర్‌లోని ఆ మానవతా గుణమే టిడిపిలోని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి స్ఫూర్తిగా ఈ నాటికీ నిలిచి ఉందన్నారు. రామకృష్ణ మిషన్, బేలూరు మఠం 11 గ్రామాల్లో 1100 ఇళ్ళను కట్టిస్తుంటే వారికి పెద్ద ఎత్తున విరాళాలిచ్చి అన్నివిధాలా ఎన్టీఆర్ సహకరించారని అన్నారు. ఆ స్ఫూర్తిని ఎప్పటికీ కాపాడుకుందామని లోకేశ్ ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/