నేడు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు

Today is the mid-term elections in America

న్యూయార్క్ః నేడు అమెరికాలో మ‌ధ్యంతర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికే డెమోక్రాట్లు, రిప‌బ్లిక‌న్లు హోరాహోరీగా ప్ర‌చారం చేశారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రెండేళ్ల జో బైడెన్ పాల‌న‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయి.

అయితే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు అంటే ఏంటో తెలుసుకుందాం… ఉభ‌య‌స‌భ‌ల‌కు ఈ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. దీంట్లో హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌, సేనేట్ కోసం ఎన్నిక‌లు జ‌రుగుతాయి. సాధార‌ణంగా మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు రెండేళ్ల‌కు ఒక‌సారి జ‌రుగుతాయి. నాలుగేళ్ల కోసం అధ్య‌క్షుడిని ఎన్నుకుంటారు. అయితే ఆ త‌ర్వాత రెండేళ్లకు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తారు. అమెరికాలో కాంగ్రెస్(ఉభ‌య‌స‌భ‌లు) చ‌ట్టాలు చేస్తుంది. చ‌ట్టాల త‌యారీలో హౌజ్‌లో ఓటింగ్ జ‌రుగుతుంది. అయితే ఆ చ‌ట్టాల‌కు సేనేట్‌లో అనుమ‌తి ద‌క్క‌వ‌చ్చు లేదా అడ్డుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌తి రాష్ట్రంలో ఇద్ద‌రు సేనేటర్లు ఉంటారు. వాళ్ల కాల‌ప‌రిమితి ఆరేళ్లు. ఇక హౌజ్‌కు ఎన్నిక‌య్యే ప్ర‌తినిధులు రెండేళ్లు స‌ర్వ్ చేస్తారు. చిన్న జిల్లాల‌కు వాళ్లు ప్రాతినిధ్యం వ‌హిస్తారు.

న‌వంబ‌ర్‌లో హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌లోని అన్ని సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి. దీంతో పాటు సేనేట్‌లోని మూడ‌వ వంతుకు కూడా ఎన్నిక‌లు ఉంటాయి. అనేక పెద్ద రాష్ట్రాల్లోనూ గ‌వ‌ర్న‌ర్‌తో పాటు లోకల్ అధికారుల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తారు. ఈసారి మ‌ధ్యంత‌ర పోరు ఆస‌క్తిక‌రంగా మార‌నున్న‌ది. గ‌త రెండేళ్ల నుంచి హౌజ్‌, సేనేట్‌లో డెమోక్ర‌టిక్ పార్టీ మెజారిటీ ఉంది. చ‌ట్టాలు చేయ‌డంలో ఇది ప్రెసిడెంట్ బైడెన్‌కు అనుకూలంగా మారింది. కానీ రిప‌బ్లిక‌న్ల‌పై చాలా స్వ‌ల్ప తేడాతో డెమోక్రాట్లు అధికారంలో ఉన్నారు. అందుకే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో పోటీ రస‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి. తాజా అంచ‌నాల ప్ర‌కారం రిప‌బ్లిక‌న్లు హౌజ్‌లో నెగ్గే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సేనేట్‌లో డెమోక్రాట్లు పాగా వేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌లోని 435 సీట్ల‌లో రెండు పార్టీల ఆధిప‌త్యం ఉంది. పెన్సిల్వేనియా, కాలిఫోర్నియా, ఓహియో, నార్త్ క‌రోలినా రాష్ట్రాల్లోని న‌గ‌రాలు మ‌ధ్యంత‌ర తీర్పులో కీల‌కం కానున్నాయి. సేనేట్ కోసం నెవ‌డా, ఆరిజోనా, జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రేసు ర‌స‌వ‌త్తరంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. చాలా స్థానాల్లో ఫైట్ చాలా టైట్‌గా ఉంటుంద‌ని, తుది ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. ఇమ్మిగ్రేష‌న్‌, క్రైమ్‌, ద్ర‌వ్యోల్బ‌ణం అంశాల‌పై రిప‌బ్లిక‌న్లు ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రో వైపు అబార్ష‌న చ‌ట్టాన్ని డెమోక్రాట్లు ఎన్నిక‌ల్లో వాడుకోవాల‌నుకుంటున్నారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా 2024 అధ్య‌క్ష రేసు ఆస‌క్తిక‌రంగా మారే ఛాన్సు ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/