హుస్నాబాద్‌లో నేడు రేవంత్ రెడ్డి పాదయాత్ర

today-is-revanth-reddy-padayatra-in-husnabad

హైదరాబాద్ః హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగనుంది. . ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం రాత్రి నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం కట్కూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద బస చేసిన రేవంత్‌ గురువారం ఉదయం 9 గంటలకు హనుమకొండ జిల్లా బీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుంటారు.

ఉదయం 10 గంటలకు గండిపల్లి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి అనంతరం భూ నిర్వాసితులతో రేవంత్ మాట్లాడుతారు. 11 గంటలకు సైదాపూర్‌ మండలంలోని సర్వాయిపేట సర్దార్‌ సర్వాయి పాపన్నకోటను రేవంత్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 1గంటకు కట్కూర్ క్రాస్ రోడ్డులోని క్యాంప్ సైట్ లో భోజన విరామం ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభమై అంతకపేట, చౌటపల్లి, జనగామ, తోటపల్లి, గాంధీనగర్‌, కిషన్‌నగర్‌ గ్రామాల మీదుగా సాయంత్రం 5 గంటలకు హుస్నాబాద్‌ కు చేరుకుంటుంది. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించే మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. రేవంత్ యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రజలను కోరారు.