మరకలు వదిలించాలంటే..

To get rid of stains .

మరక మంచిదే అంటూ ప్రకటనల్లో చూపించినంత మాత్రాన వాటిని ఓ పట్టాన వదలగొట్టలేం. ఒక్కోరకం మరకకు ఒక్కో చిట్కా పాటించాలి. పిల్లల దుస్తుల మీద ఇంకు మరకలు సహజం. వీటిని వదిలించాలంటే ఆ మరకపై కాసిన్ని పాలు పోసి వదిలేయాలి. మరక పోతుంది. దానిపై కాస్త హెయిర్‌ స్ప్రేను చల్లి కాసేపాగి ఉతికినా మరకలు పోతాయి. టమాటా రసం లాంటివి పడినప్పుడు ఆ మరకపై నేరుగా వైట్‌ వెనిగర్‌తో రుద్ది వెంటనే ఉతికేస్తే మరకలు పోతాయి. కూరగాయల మరకలు పడిన చోట వంటసోడా చల్లాలి. ఆ తరువాత సమాన పరిమాణాల్లో నీళ్లు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలిపి ఆ ద్రవాన్ని దుస్తులపై స్ప్రే చేసి ఉతికితే సరి. చెమట వల్ల దుస్తులపై మరకలు పడతాయి. వీటిపై నిమ్మ తొక్కతో రుద్దితే మరక పోవడమే కాకుండా సువాసనలు వెదజల్లుతాయి. నూనె, గ్రీజు మరకలు పడిన చోట చాక్‌పీస్‌తో రుద్దితే చాలు. సుద్దముక్క నూనెను పీల్చేస్తుంది.
మరక పడిన చోట వంటసోడా చల్లాలి. ఇది నూనె గ్రీజులను పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ దుస్తులను వైట్‌ వెనిగర్‌ వేసిన నీటిలో నానబెట్టి డిష్‌వాష్‌ బార్‌తో రుద్దితే సరిపోతుంది. కాఫీ మరకలు పోవాలంటే ఆ ప్రాంతంలో కొద్దిగా వంటసోడా వేసి బాగా రుద్దాలి. లేదా మరక పడిన వెంటనే దానిపై కాసిన్ని వేడి నీళ్లు పోయాలి. రక్తపు మరకలపై కొద్దిగా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ రాసి పావుగంటాగి శుభ్రం చేయాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/