ఆమ్ ఆద్మీ పార్టీలో …తెలంగాణ జన సమితి పార్టీ విలీనం..?

తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి..ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయబోతున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ ఉద్యమం కొరకు ఆన్ని పార్టీలతో కూడిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (T-JAC) కు చైర్మన్ గా వ్యవహరించాడు కోదండరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పటు లో కీలక పాత్ర పోషించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోదండరాం పరిస్థితి మరోలా మారింది. దీంతో ఆయనే స్వయంగా తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించారు. సొంతంగా పార్టీ పెడితే తెలంగాణ ఉద్యమకారులంతా మద్దుతు ఇస్తారని అనుకున్నారు కానీ దానికి పూర్తి భిన్నంగా జరిగింది.

2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ… ఏమాత్రం రాణించలేదు. అయితే అప్పటి నుంచి జన సమితి పార్టీని బిజెపి పార్టీ లో విలీనం చేస్తారని వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. తాజాగా ఇప్పుడు ఈ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈరోజు జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఢిల్లీ వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కోదండరామ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జన సమితి పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రేపు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.