భక్తులు గమనించగలరు ..రెండ్రోజులు శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala Temple
Tirumala Temple

రెండ్రోజులు శ్రీవారి ఆలయం మూతపడనుంది. సూర్య, చంద్రగ్రహణం వల్ల గుడి మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఏర్పడనుంది. అలాగే నవంబర్ 8న చంద్ర గ్రహణం. దీంతో ఆ రెండు రోజులు 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఆ రెండు రోజుల్లో కేవలం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. దీంతో ఆ రోజు ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి వేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులు, ర‌క్ష‌ణ సిబ్బంది, ఎన్ఆర్ఐల ద‌ర్శ‌నంతోపాటు క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార‌ వంటి ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు.

న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. న‌వంబ‌రు 8న కూడా కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనభాగ్యం ఉంటుంది. భక్తులు ఈ మార్పులను గమనించాలని, ఈ సమాచారం ప్రకారం ప్రణాళికలు వేసుకుని దర్శనానికి రావాలని సూచించింది.