మహిళల ఐపిఎల్‌ మొదలు పెట్టండి

గంగూలీ, బిసిసిఐకి గవాస్కర్‌ కీలక సూచనలు

Sunil Gavaskar
Sunil Gavaskar

ముంబయి: భారత మహిళల జట్టు మెరుగవ్వడానికి సౌరవ్‌ గంగూలీకి , బిసిసిఐకి క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కీలక సూచనలు చేశారు. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓడిన నేపథ్యంలో సన్నీ కొన్ని సలహాలు, సూచనలు చేశారు. తాజాగా సునిల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ… ‘భారత మహిళల జట్టు మెరుగవ్వడానికి బీసీసీఐ ప్రభావం ఎంతో ఉంది. బీసీసీఐ వారి పురోగతిపై దృష్టిసారిస్తుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు మన అమ్మాయిలను ఆస్ట్రేలియాకు పంపించి ముక్కోణపు సిరీస్‌ (ఇంగ్లాండ్‌, ఆసీస్‌, భారత్‌) ఆడించింది. దీంతో హర్మన్‌సేనకు పిచ్‌, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం లభించింది. ఇది చాలా తెలివైన నిర్ణయం’ అని అన్నారు.

‘మహిళల క్రికెటర్ల కోసం సౌరవ్ గంగూలీ, బీసీసీఐ మరో అడుగు వేయాలి. వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్‌ ఐపీఎల్ నిర్వహించాలని నేను భావిస్తున్నా. దీంతో ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారు. ఇప్పుడు ఉన్న ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా మహిళా జట్టు ఎంతో పటిష్ఠంగా నిలవడానికి ఆసీస్‌ క్రికెట్ బోర్డు ఎన్నో ఏళ్ల కృషి ఉంది. అక్కడి క్రికెటర్లుకు ‘ఉమెన్స్‌ బిగ్‌ బాష్ లీగ్‌’ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఉమెన్స్‌ బీబీఎల్‌ ఆడారు. ఆ టోర్నమెంట్‌లో బలమైన ప్రత్యర్థులతో ఆడొచ్చు. దీంతో ఆటలో ఎంతో పరిణతి సాధించవచ్చు’ సన్నీ పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/