చైనా శాస్త్రవేత్తకు మూడేళ్ల జైలు శిక్ష

Chinese Scientist
Chinese Scientist

బీజింగ్‌: ప్రపంచంలోనే తొలిసారిగా చిన్నారుల్లో జన్యువుల మార్పిడి చేసినట్లు చెప్పుకుంటున్న చైనా శాస్త్రవేత్త హిజియాన్‌కుయ్ కి స్థానిక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. షెన్‌జెన్‌లోని సదర్న్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన ఈ శాస్త్రవేత్త చట్ట విరుద్ధంగా వైద్య వృత్తిని నిర్వహించిన ఆరోపణలపై జరిగిన విచారణలో దోషిగా నిర్ధారణ కావటంతో కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించినట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో ఈ శాస్త్రవేత్త జన్యుమార్పిడి టెక్నాలజీని ఉపయోగించి ఇద్దరు ఆడశిశువులకు జన్యువులను మార్చటం ద్వారా వారికి భవిష్యత్‌లో ఎయిడ్స్‌ వంటి వ్యాధులేవీ సోకకుండా రక్షణ కవచాన్ని ఏర్పరచినట్లు ఈ శాస్త్రవేత్త ప్రకటించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చైనా ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఇందులో ఆయన నేర నిర్ధారణ కావటంతో ఆయన్ను ఉద్యోగం నుండి సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ఆయన చేసిన పరిశోధనలు ‘ప్రకృతి విరుద్ధమ’ని స్పష్టం చేసింది. ఈ పరిశోధనల్లో ఆయనకు సహకరించిన ఝాంగ్‌రెన్లి, కిన్‌ జిన్‌ఝౌలకు కూడా జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/