జగన్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసి మూడేళ్లు గడిచింది : చంద్రబాబు

అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేశారన్న బాబు

boycotting ZPTC and MPTC elections: TDP chief Chandrababu
TDP chief Chandrababu

అమరావతి: జగన్ తన విధ్వంస పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చూపించడం మొదలుపెట్టి నేటికి మూడేళ్లు అవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయని.. అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేసిన మొట్ట మొదటి పని ప్రజావేదికను కూల్చివేయడమే అని మండిపడ్డారు. రూ. కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారని.. ఏపీలో ఇప్పుడున్నది కూల్చివేతల ప్రభుత్వమని అసహనం వ్యక్తం చేశారు.

జగన్ చేసినవన్నీ కూల్చివేతలేనని.. ఆయన రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్ కు డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్‌ చేతకాదు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని, ఆర్థిక పరిస్థితిని, దళితుల గూడును, ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాష్ట్ర యువత భవిష్యత్తును.. ఇలా అన్నింటినీ కూల్చేశారు అని విమర్శించారు.

ప్రజలు కోరుకున్న అమరావతి రాజధాని కలలను, పోలవరం స్వప్నాన్ని చిదిమేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆక్షేపించారు. జగన్ ఈ మూడేళ్లలో కట్టినది ఏమీ లేదని, అంతా శూన్యమని మండిపడ్డారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన కొనసాగిస్తున్నారని.. తన వల్ల ఏమీ జరగదని, తనకేమీ రాదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలని చంద్రబాబు హితవు పలికారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/