కడప లో కుంగిపోయిన మూడంతస్తుల భవనం

కడపలో మూడంతస్తుల భవనం కుంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని విద్యామందిర్ సమీపంలో వెంకటరామరాజుకు ఓ మూడంతస్తుల భవనం ఉంది. అది పాతబడిపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించి మరమ్మతులు చేయిస్తున్నారు. కాగా మొదటి అంతస్తులో ఓ ఫ్యామిలీ, రెండో అంతస్తులో మరో ఫ్యామిలీ ఉంటోంది.

ఈ క్రమంలో బుధవారం అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భవనం నుంచి శబ్దాలు వినిపించాయి. దీంతో గబుక్కున లేచిన రెండో అంతస్తులోని వారు బయటకు వచ్చి చూశారు. అప్పటికే భవనం ఓ వైపు కుంగిపోవడం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. క్షణం ఆలస్యం చేయకుండా బయటకు పరుగులు తీశారు. తలుపులు తెరుచుకోకపోవడంతో మొదటి అంతస్తులో ఉన్న వారు లోపలే ఉండిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో కిటికీల ఊచలు తొలగించి వారిని కాపాడారు. భవనం మరమ్మతుల కోసం డ్రిల్లింగ్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.