సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతామని బెదిరింపులు..

మే 29న కాంగ్రెస్ నేత, ర్యాపర్ సిద్దూ మూసేవాలా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే..ఇప్పుడు ఆయన తండ్రిని కూడా చంపుతామని బెదిరింపులు రావడంతో కుటుంబ సభ్యులు భయం భయంగా బ్రతుకుతున్నారు. సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లోని సభ్యుడు ఈమెయిల్ ద్వారా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్ధూ మెయిల్ ఐడీకి షూటర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ మెయిల్‌ వచ్చింది.

తమ అనుచరుడి హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్లు నిందితుడు ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. గ్యాంగ్‌స్టర్ల గురించి గానీ తమ భద్రత గురించి ఏ విషయమైనా లేవనెత్తితే సిద్ధూ కంటే దారుణంగా చంపేస్తామని హెచ్చరించాడు. నోరుమూసుకొని సైలెంట్‌గా ఉండాలని లేకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక తో సిద్దూ మూసేవాలా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.