పాకిస్టాన్‌లో భారీ వ‌ర‌ద‌లు.. ప్రమాదపుటంచున మోహెంజొ దారో నిర్మాణాలు..

threat from Pakistan’s monster monsoon, the 5000-year-old heritage of Mohenjo Daro

ఇస్లామాబాద్ః పాకిస్తాన్‌లో కుంభవృష్టి ,వరద బీభత్సనికి వెయ్యికిపైగా మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఇంకా అనేక ప్రాంతాల్లో మృత్యుఘోష వినిపిస్తోంది. ఆప‌న్న‌హ‌స్తం కోసం ల‌క్ష‌లాది మంది ఎదురుచూస్తున్నారు. మ‌రోవైపు పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతంలో ఉన్న వార‌స‌త్వ నిర్మాణం మోహెంజొ దారో వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టు 16 నుంచి 26 మ‌ధ్య .. మెహెంజొ దారోలో సుమారు 779.5 మిల్లీమీట‌ర్ల వ‌ర్షం కురిసింది. దీని వ‌ల్ల మోహెంజొ దారో సైట్ వ‌ద్ద డ్యామేజ్ జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. సుమారు అయిదు వేల ఏళ్ల క్రితం నాటి నాగ‌రిక‌త‌కు చెందిన ఆ క‌ట్ట‌డాల్లో వ‌ర్షాల వ‌ల్ల ప‌గులు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు.

మోహెంజొదారోలో అనేక గోడ‌లు స్వ‌ల్పంగా కూలిన‌ట్లు అంచ‌నాకు వ‌చ్చారు. స్తూప డోమ్ ర‌క్ష‌ణ గోడ కూడా స్వ‌ల్పంగా ధ్వంస‌మైన‌ట్లు పాక్ ఆర్కియాల‌జీ అధికారులు చెబుతున్నారు. సింధు ప్రావిన్సులోని క‌రాచీ నుంచి ల‌ర్కానా మ‌ధ్య ఉన్న ఇటుక నిర్మాణాల‌ను 1980లో వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో ప్ర‌క‌టించింది. అక్క‌డ హ‌ర‌ప్పా నాగ‌రికత‌కు చెందిన ప‌ట్ట‌ణాలు ఉన్న‌ట్లు కొంద‌రు పురావాస్తు శాఖ నిపుణులు అంచ‌నా వేశారు. అయితే తాజా వ‌ర్షాల వ‌ల్ల ఆ ప్రాంతంలోని పురాత‌న క‌ట్ట‌డాలు దెబ్బ‌తిన్నాయ‌ని, వాటి సంర‌క్ష‌ణ‌కు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/