కరోనా బాధితుల కోసం 9 రోజుల్లో చైనా అద్భుతం

యుద్ధ ప్రాతిపదికన పూర్తయిన 1000 పడకల ఆసుపత్రి

China - Hospital
China – Hospital

చైనా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ బారిన పడి చైనాలో 361 మంది ప్రాణాలు కోల్పయారు. దీంతో చైనా కరోనా వైరస్ బాధితులకు ఇతర ఆసుపత్రులకు తరలిస్తే వ్యాధి ఇతరులకు సులభంగా వ్యాప్తి చెందుతుందని భావించి చైనీయులు ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణం ఆలోచన చేశారు. అది కూడా కరోనా వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్న వుహాన్ నగర శివార్లలో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో ప్రధానంగా ముందే రూపుదిద్దుకున్న కాంక్రీట్ బ్లాక్స్ ను ఉపయోగించారు. దానివల్ల ఎంతో సమయం ఆదా అయింది. పునాదులు వేసిన తర్వాత వాటిపై కాంక్రీట్ బ్లాక్స్ ను ఓ క్రమపద్ధతిలో అమర్చుకుంటూ వెళ్లారు. ఎక్కడిక్కడ జాయింట్లను పకడ్బందీగా కలుపుకుంటూ పోయారు.

ఇందుకోసం దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న కాంక్రీట్ బ్లాక్స్ ను వుహాన్ తరలించారు. నిపుణులైన ఇంజినీర్లు దేశంలో ఎక్కడున్నా సరే వాళ్లందరినీ వుహాన్ తీసుకువచ్చి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రతువులో 7 వేల మంది కార్మికులతో పాటు 1000 యంత్రాలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ ఆసుపత్రికి అవసరమైన నిర్మాణ సరంజామా తరలింపు, మానవ వనరుల తరలింపు బాధ్యతను సైన్యానికి అప్పగించడంతో ఆసుపత్రి నిర్మాణం పరుగులుపెట్టింది. ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, 419 వార్డులు, 30 ఐసీయూలు ఉన్నాయి. 1400 మంది డాక్టర్లను ఇక్కడ నియమించనున్నారు. నేటి నుంచి ఇక్కడ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/