ప్రభుత్వంపై యువత పోరాడి హక్కులను సాధించుకోవాలి

ఉద్యోగాలు అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు: చంద్రబాబు

అమరావతి : ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశ భవిష్యత్తుకు దిక్సూచి అయిన యువతీయువకులకు శుభాకాంక్షలు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. యువత అభ్యున్నతే దేశాభ్యున్నతి అనేలా తెలుగుదేశం ప్రభుత్వం అడుగులేసిందని అన్నారు. వేలాది మంది విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలను అందించామని తెలిపారు. ప్రతి నెలా నిరుద్యోగులకు భృతి అందించామని చెప్పారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు అండగా నిలిచామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించామని చెప్పారు. ఏపీలో గత రెండేళ్లుగా పైసా పెట్టుబడులు కూడా రాలేదని విమర్శించారు. పరిశ్రమలు లేవు, ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవని ఎద్దేవా చేశారు. యువతకు అండగా నిలిచేందుకు టీడీపీ ప్రభుత్వం తెచ్చిన పథకాలన్నీ రద్దు చేశారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి యువతకు ప్రోత్సాహకాలు లేకపోగా… ఉద్యోగాలు కావాలని అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో నిరుద్యోగులను అణచి వేస్తున్నారని చెప్పారు. తెగువకు, త్యాగానికి నిర్వచనమైన యువత ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను పోరాడి సాధించుకోవాలని… దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/