బాలయ్య షో కు చంద్రబాబు అందుకే వెళ్లారు – మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు..బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ 2 షో కు ముఖ్య అతిధిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ షో లో పలు ఆసక్తికర విషయాలను చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ షో లో చంద్రబాబు చెప్పినవన్నీ కూడా అబద్దాలే అని అన్నారు వైస్సార్సీపీ మంత్రి రోజా. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. అనంతరం రాష్ట్రంలో పరిణామాలపై స్పందించారు.

న్టీఆర్ వెన్నుపోటు గురించి అనుకూల మీడియాతో చెబితే ప్రజలు నమ్మడం లేదని.. వేరే వేదికైన షోతో ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను పదవీ వ్యామోహంతో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని.. ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు అమాయకంగా ఆ రోజు ‘మీరు కూడా మాతో ఉన్నారు.. నేను కాళ్లు పట్టుకుని ఏడ్చాను.. అయినా ఆయన వినలేదు.. నేను చేసింది తప్పా అని’ అడగడం ప్రజల్ని పిచ్చోళ్లను చేయడమే అన్నారు.

ప్రజలు అంత పిచ్చోళ్లు కాదు.. వీళ్లు తింగరోళ్లు కాబట్టి.. వీరు ఇంకా మభ్య పెట్టాలని ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. ఒక్క ప్రోమో మీద ఎన్ని వివాదాలు వచ్చాయో చూశామని.. ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఆయన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేసి.. చెప్పులు విసిరేసి ఆయన పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఎన్టీఆర్ ఫోటోలను ఎన్టీఆర్ భవన్ నుంచి బయటకు పడేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చేసి ఆరాధ్య దైవం అంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని రోడ్డుపైకి తెచ్చారన్నారు.

రాయలసీమకు న్యాయ రాజధాని వస్తుంటే సీమ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా సంతోషపడాల్సిందిపోయి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం అమరావతి రాజధాని అంటూ కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు ఏ కష్టం వచ్చినా దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ నేనున్నాను అంటూ ముందుకువచ్చి డైవర్ట్‌ పాలిటిక్స్‌కు తెరలేపుతాడని మంత్రి రోజా మండిపడ్డారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జనకు జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. విశాఖలో గర్జన జరుగుతుందని తెలిసి కూడా పవన్‌ కల్యాణ్‌ కావాలనే మూడు రోజులు విశాఖలో ప్రోగ్రాం పెట్టుకున్నాడని అన్నారు.