ఇదేనా మేకిన్‌ ఇండియా అంటూ ప్రధాని మోడీ ఫై కేసీఆర్ ధ్వజం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి ప్రధాని మోడీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. బుధువారం సీఎం కేసీఆర్ జగిత్యాల లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా మోతె లో ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభ లో పాల్గొని..కేంద్రం ఫై నిప్పులు చెరిగారు.

‘మేకిన్‌ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్‌ దవాఖాన పక్కన చైనా బజార్‌. జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్‌. కరీంనగర్‌ సర్కస్‌గ్రౌండ్‌ చైనా బజార్‌. ఇదేనా మేకిన్‌ ఇండియా. మేకిన్‌ ఇండియా బజార్‌ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్‌ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్‌ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. మోసపోయి ఉంటే గోసపడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలపై చర్చించాలే’ అన్నారు.

మేకిన్ ఇండియాలో ఏం రాక‌పోయినా దేశంలో 10 వేల ప‌రిశ్ర‌మ‌లు మూతప‌డ్డాయి. ఎక్కడంటే అక్క‌డ నేను చ‌ర్చ‌కు సిద్ధం. ఈ దేశంలో ఏ న‌గ‌రంలో అంటే ఆ న‌గ‌రంలో చ‌ర్చ‌కు సిద్ధం. 50 ల‌క్ష‌ల మంది ఫ్యాక్ట‌రీ ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవ‌త్స‌రానికి 10 ల‌క్ష‌ల మంది బ‌డా పెట్టుబ‌డిదారులు భార‌త‌దేశాన్ని వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్తిపోతున్నారు. మేకిన్ ఇండియా అంటే అన్న‌వస్త్రానికి పోతే ఉన్న వ‌స్త్రం పోయింద‌న‌ట్టు ఉన్న‌వి ఊసిపోతున్నాయి త‌ప్ప కొత్త‌గా వ‌చ్చిందేమీ లేదు. మాట‌ల గార‌డీ, డంబాచారం, డ‌బ్బాల పలుగు రాళ్లు వేసి ఊపిన‌ట్టు లోడ లోడ మాట్లాడుడు త‌ప్ప దేశానికి ఏ రంగంలో ఏం జ‌రిగింది అని కేసీఆర్ ప్రశ్నించారు.

కేంద్రం దద్దమ్మ చేతగాని తనం వల్ల తెలంగాణ రాష్ట్రం 3లక్షల కోట్లు నష్టపోయింది. ఇంటికి వెళ్లిన తర్వాత మేధావులను అడిగితే వాస్తవ విషయాలు తెలుస్తాయి. అప్రమత్తంగా లేకపోతే.. ఒక ఒరవడి, ప్రచార హోరులో కొట్టుకొని పోతే మళ్లీ ఆగమై పోతాం. ఆనాటి తెలంగాణ నాయకత్వం చేసిన ఒక్క చిన్న పొరపాటు వల్ల 60 సంవత్సరాలు గోసపడ్డాం. ఎంత మంది చనిపోయారు ? ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? ఎన్నిచోట్ల తిరగాల్సి వచ్చింది? ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది? ఎన్ని పాటలు పడాల్సి వచ్చింది? ఎన్ని నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది? మన ఉద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? ఒక్క చిన్న పొరపాటుకు 60 సంవత్సరాలు గోసపడ్డ జాతి మనది. ఈ రోజు కూడా డంబాచారం, గోల్‌మాల్‌ గోవిందం గాళ్లను నమ్మితే కిందామీద ఆగమైపోతం’ అన్నారు.